Search blog.co.uk

Posts archive for: April, 2008
  • నేడు-రేపు My Stories-8.

    నేడు-రేపు
    పెయ్యేటి భువనేశ్వరి & శైలజ*
    (బొమ్మరిల్లులో ప్రచురితం)

    రాము,సోము స్నేహితులు. రాము ఎంత డబ్బునైనా క్షణాల్లో ఖర్చు చేసేస్తాడు. రేపు గురించి ఆలోచించడు. సోము పొదుపుగా వాడుకుంటూ తనకు క్కువైన డబ్బును బ్యాంకులో దాచుకునేవాడు.
    రాము ఆకలి లేకపోయినా చిరుతిళ్లు తింటాడు. చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ చూస్తాడు. సోము బయట ఏమీ కొనుక్కు తినడు. బాగున్న సినిమాలని ఒక్కసారి మాత్రమే చూస్తాడు.
    ఇద్దరూ స్నేహితులు కావడం వల్ల ఒకరి అలవాట్లొకరికి ఇబ్బంది కలిగిస్తూండేవి.రాము సోముని తన పంథాలోకి మార్చాలనీ,సోము రాముని తన దారికి మళ్లించాలనీ అనుకునేవారు. వారిద్దరి మధ్యా ఈ విషయమై తరచుగా వాగ్వివాదాలు జరిగేవి. ఒకోసారి అలా గంటల తరబడి వాదించుకునేవారిద్దరూ.
    రాము సోము తో ఒక రోజున , "నువ్వెప్పుడూ రేపటి గురించే ఆలోచించడంవల్ల నేడు సుఖపడ లేవు. రేపన్నది మనది కాదు. ఆ రోజుకు మనముంటామో ,ఛస్తామో తెలియదు" అన్నాడు.
    "అవును రేపన్నది మనది కాదు. ఆ రోజుకు మననే అవసరం వెతుక్కుంటూ వస్తుందో తెలియదు.
    అందుకే ప్రాతి ఒక్కరూ రేపు గురించి ఆలోచించాలి. డబ్బు దాచుకోవడం మరీ ముఖ్యం. రేపు ఏ అవసరం వచ్చినా ఎవరినీ యాచించనక్కర్లేదు" అన్నాడు సోము.
    "డబ్బుని ఎప్పుడూ ప్ట్టెలో బంధించ కూడదు. లక్ష్మి చంచల మైనది. స్వేచ్ఛను కోరుకుంటుంది. నా డబ్బు నిత్యం చలామణిలో ఉండి నలుగురికీ ఉపయోగ పడుతోంది. నీ డబ్బు చలామణిలో లేక ఎవరికీ ఉపయోగ పడటం లేదు. అసలు ఖర్చు చెయ్యడం కోసమే కదా మనిషి డబ్బుని సృష్టించాడు?" అన్నాడు రాము.
    "నువ్వు పొరబాటు పడుతున్నావు. మనిషి డబ్బుని ఖర్చు చేయమని సృష్టించ లేదు. పళ్లు, కాయ గూరలు, తిండి గింజలు అన్నీ కూడా నిలవుండేవి కాదు. అందుకని నిలవుండే డబ్బుని సృష్టించాడు మనిషి. ఆ తర్వాత బ్యాంకులో డబ్బు దాచుకుంటే చలామణిలో ఉండదనుకుంటున్నావా? బ్యాంకు వాళ్లు అవసరంలో ఉన్న వారికి వడ్డీకి అప్పులిస్తారు. దాచుకున్నందుకు మనకూ వడ్డీ ఇస్తారు. మనకంటే త్లివిగా డబ్బు ఖర్చుచేసే వారి వద్ద
    డబ్బు దాచుకోవడం మెరుగైన పద్ధతి కదా!" అన్నాడు సోము.
    "సరే. డబ్బు దాచుకుంటావు. అప్పుడే భూకంపమో గాలి వానో వచ్చి చచ్చి పోయావనుకో. ఏమిటి
    లాభం?" అన్నాడు రాము.
    "భూకంపం గాలి వానలకు చచ్చి పోకుండా బ్రతికావనుకో, అప్పుడు లాభమే కదా! అయినా నీకూ
    నాకూ తేడా చూశావా? డబ్బు దాచుకోక పోవడం వల్ల నువ్వెప్పుడూ చావు గురించే ఆలోచిస్తున్నావు. డబ్బు దాచుకోవడం వల్ల నేనెప్పుడూ బ్రతుకు గురించే ఆలోచిస్తున్నాను. రేపు సుఖ పడతానని నాకున్న నమ్మకం నీకు లేదు" అన్నాడు సోము.
    ఇలా వాళ్లిద్దరూ వాదించుకుంటూ ఊరి బయటకు వచ్చారు. అక్కడొక రైతు ఆవునొకదాన్ని కొడుతూ నానా దుర్భాషలూ ఆడుతున్నాడు. రాము,సోములు ఏం జరిగిందని అడిగారు.
    "నేను రోజూ దీనికి కడుపు నిండా తిండి పెడుతున్నాను. ఈ వేళ ఏం మాయ రోగం వచ్చిందో
    దీనికి -కట్లు తెంచుకుని ఎవరెవరి పొలాల్లోనో చొరబడి మేసినంత మ్మేస్తూ పొలాలు తొక్కి పాడు చేస్తోంది. ఇలా చేస్తే రేపటికి దీనికి తిండి దొరకదు. మనకూ తిండి ఉండదు. ఆ మాత్రం తెలియకపోతే ఎలా అని కొడుతున్నాను" అన్నాడు రైతు కోపంగా.
    "పాపం, నోరు లేనీ జంతువు. రేపటి గురించి దానికేమి తెలుస్తుంది? స్వేచ్ఛకోసం కట్లు తెంచుకుంది. కనబడిన పొలాల్లో చొరబడి తిన్నంత తిని తిరుగుతోంది. దాన్ని కొడితే ఏం లాభం? నువ్వే ఆవును జాగ్రత్తగా కట్టాలి" అన్నాడు రామూ జాలిగా ఆవును చూస్తూ.
    వెంటనే సోము తల అడ్డంగా ఊపి , పశువు కూడా రేపటి గురించి ఆలోచిస్తుంది. అదే ఆవుని అడవిలో వదిలి పెట్టు. అప్పుడది రోజూ ఒకే చోట మేత మెయ్యదు. ఒక రోజు ఒకచోట ఇంకో రోజు ఇంకోచోట అలా మారుతూ వుంటుంది. అందువల్ల మేత మేసిన చోట్ల మళ్లీ గడ్డి పెరిగే అవకాశముంటుంది. ఇక్కడ ఆవుకి యజమాని ఉండి అన్నీ సమకూర్చుతున్నాడు. ఆవు నిశ్చింతగా వుండి రేపటి గురించి ఆలోచించడం మానేసింది. ఎదుటి వాళ్ల మీద ఆధార పడ్డ వాళ్లు రేపు గురించి ఆలోచించరు. అర్థమైందా?" అన్నాడు సోము.
    దీనికి రాము ఒప్పుకోక, "జంతువులకు రేపు గురించి తెలియదు. అందుకే అవి హాయిగా ఉంటున్నాయి." అన్నాడు.

    "నిజమే! హాయిగా ఉండడానికి రేపు గురించి ఆలోచించక పోవడం జంతువుల లక్షణం" అన్నాడు సోము.
    రాముకి ఉక్రోషం వచ్చింది. చాలా తెలివిగా సోము తనని పశువని తిట్టాడు. ఏమనాలో తెలియక,"నేర్చుకునే మంచి లక్షణాలెక్కడున్నా తెలుసుకోవడం ఉత్తమ పురుష లక్షణం. అందుకే నేను జంతువులనుంచి రేపు అనే రోజు గురించి ఆలోచించ కూడదని తెలూకున్నాను" అన్నాడు.
    సోము ఏ మాత్రం తడుముకోకుండా, "అవును. నేను కూడా జంతువుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. రేపు గురించి ఆలోచించాలని కూడా జంతువుల వల్లే తెలిసింది నాకు. జంతువులే కాదు. పక్షులూ,క్రిమి కీటకాలూ కూడా మనకిదే నీతిని చెబుతాయి. రేపు వర్షం వస్తుందేమోనని ఈ రోజే పక్షులు గూడు కట్టు కుంటాయి. పిల్లులు పిల్లల్ని పెట్టే ముందు గుడ్డ పీలికలు పోగు చేసి మెత్తటి పక్కనుఏర్పాటు చేసుకుంటాయి. తేనె టీగలు తేనెను పోగుచేసుకుంటాయి. చీమలు ఆహారాన్ని సేకరించి దాచుకుంటాయి" అన్నాడు.
    "నేనేదంటే అదే కాదంటావు. ఒక సారి నన్ను జంతువుతో సమానమంటావు. ఇంకోసారి జంతువులనుంచి నేర్చుకోవలంటావు. నీదంతా వితండ వాదనలాఉంది" అన్నాడు రాము ఉక్రోషం ఆపుకోలేక.
    అప్పుడు రైతు కలగ చేసుకుని, "సోముది వితండ వాదమైతే నీదీ వితండవాదమే! నిజం తెలుసుకుందుకే మనం వాదించుకోవాలి తప్ప అన్న మాటే నెగ్గించుకోవాలంటే ఉన్న మాట తెలియదు. సోము అన్నీ చక్కగా చెప్పాడు. నువ్వు అన్నీ సోము దగ్గరే నేర్చుకో. సోమూ మాటల వల్ల నీకే కాదు,నాకూ ఈ ప్రపంచానికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది" అని రాముకి హిత బోధ చేసాడు.
    "నువ్వూ నేనూ రేపటి గురించి ఆలోచిస్తే అందువల్ల మనకి లాభముంటుందేమో కానీ ప్రపంచానికేం మేలు జరుగుతుంది?" అన్నాడు రాము ఆశ్చర్యంగా.
    "మాంసం కోసం మనం పక్షుల్నీ జంతువుల్నీ చంపుతాం. ఆ జాతులు నశించి పోయేలా వాటిని చంపేయ కూడదు. అలాగే ఆత్మ రక్షణ కోసం కౄర మౄగాలనూ,విష కీటకాల్నూ కూడా నాశనం చేయ కూడదు. ప్రపంచానికి వాటివల్ల ప్రయోజన్ముంది. నివాసం కోసం అడవులను నరికి ఇళ్లు కట్టుకున్నం. వౄక్ష జాతి నాశనమైతే , భూమ్మీద వానలు పడవు.విష వాయువులు పీల్చ బడవు. నదీ జలాలను పరిశుభ్రంగా ఉంచకుండా కలుషితం చేస్తే ఏదో ఒక రోజున అవి విష జలాలై మనకు తాగడానికి నీరుండదు. మనమంతా రేపు గురించి ఆలోచించి మన సంపదతో పాటు.ప్రకౄతి సంపదను పొదుపుగా వాడుకుంటే ముందు తరాలకు జరిగే కీడు ఆగి పోతుంది. ఈ విషయాలన్నీ సోము మాటలు విన్నాక్ నాకు తట్టాయి." అన్నాడు రైతు.
    అప్పటికి రాముకి కూడా రేపు గొప్పతనం అర్థమై ,"రేపంట్ ఎప్పుడో వచ్చేది కాదు. ఏదో ఒకరోజున ప్రతి రేపూ నేడు అవుతుంది. అందుకే రేపు గురించి ఆలోచించకుండా మనిషి సుఖ పడ లేడు " అని ఒప్పుకున్నాడు. మిత్రుడిలో వచ్చిన మంచి మార్పుకు సోము సంతోషించాడు.*

  • బట్టీ చదువులు My Stories-7.

    బట్టీ చదువులు
    ఫిబ్రవరి 1994 బుజ్జాయిలో ప్రచురితం

    by -పెయ్యేటి భువనేశ్వరి & శైలజ*

    రాజు స్వదేశాభిమానంతో అమెరికా నుండి భారత దేశాని కొచ్చాడు. తల్లి దండ్రులెంత చెప్పినా వినకుండా ,తాత దగ్గరుండి ఇండియాలో చదువుకుంటానన్నాడు. అమెరికాలో రాజు చదివిన చదువుకి,భారత దేశంలో అతడిని పదో తరగతిలో చేర్చుకున్నరు. రాజుకు పదో తరగతిలో చెబుతున్న పాఠాలు వింటుంటే ఎంతో ఆశ్చర్యమేసింది. ఆ పాఠాలన్నీ అతను అమెరికాలో ఎప్పుడో చదివేశాడు. పాపం! రాజేం చెయ్యగలడు? అతనికి తెలుగు సరిగ్గా రాని కారణంగా ,అతడ్ని పదో తరగతిలో చేర్చుకున్నారు.
    బడిని చూసినా, బళ్లో పాఠాలు చెప్పే విధానం చూసిన రాజుకు విచిత్రంగా వుండేది. బళ్లో పిల్లలందరూ పాఠాల్ని బట్టీ పట్టి అప్పచెబుతుంటే,అలా బట్టీ పట్టి అప్పచెప్పటం చేతకాని రాజుని చూసి అందరూ పడీపడీ నవ్వుతూ,గేలి చేసేవారు. రాజు ఏమీ అనలేక మిన్నకుండేవాడు.
    అనుకోకుండా జిల్లా విద్యాశాఖాధికారి గారు తనిఖీ కొచ్చారు. పిల్లలందరూ పాఠాలు చక్కగా అప్ప చెబుతుంటే ఆయన ఎంతో ఆనందించారు. రాజు పాఠాలు అప్ప చెప్పలేక పోవడంతో విసుక్కున్నారు. అప్పుడు రాజు "నేను పాఠాలు చెప్పలేను కానీ వాటిలోని సంగతులు తెలుసుకుని ప్రయోగం చేసి చూపుతాను. వీరెవరైనా చేసి చూప గలరేమో అడగండి"అన్నాడు.
    ఇలా రాజు చెప్పడంతో బళ్లోని పిల్లలంతా బిక్క ముఖాలు పెట్టుకున్నారు. అధ్యాపకులు తత్తర పడ్డారు. జిల్లా విద్యాధికారి గారు ప్రయోగాలు చెసి చూపమనీ,అందులో పరికరాలు ఎలా అమర్చాలో చూస్తానన్నాడు. అధ్యాపకులు కంగారు పడి ప్రయోగశాలలో ఇంకా పరికరాలు అమర్చలేదన్నారు. ప్రయోగాలు చేసి చూపట ల్లేదన్నారు.
    దాంతో కోపంగా జిల్లా అధికారి అడిగారు "పరికరాలోచ్చి ఎన్నాళ్లైంది? ఇన్నాళ్లూ పరికరాల్నలా మూల పెట్టి ప్రజాధనం పాడు చేస్తారా?"అన్నారు.
    అప్పుడు అధ్యాపకులు చెప్పారు"మహా ప్రభో! మేము చెట్ల కింద బళ్లో ,కనీసం బ్లాక్ బోర్డు కూడా లేని బళ్లో చదువుకున్నాం. మేము పాఠాలు కంఠస్తం చేసి పరీక్షల్లో పాసయ్యాం. మాకు ప్రయోగాలూ గట్రా చెతకావు. ఈ పరికరాల్ని కూడా మేమెప్పుడూ చూడ లేదు. పరికరాలు అమర్చేటప్పుడు ఏమైనా పాడైతే ,తమరు మమ్మల్ని డబ్బు కట్టమంటారు. మాఇచ్చే జీతమంతా కట్టినా పరికరాలు కొనలేము. అందుకే అవన్నీ ఒక గదిలో జాగ్రత్తగా వుంచాము"అని.
    అప్పుడు జిల్లా అధికారి ఆ పరికరాలన్నీ తెప్పించి ,వాటితో ప్రయోగాలు చేసి చూపమని రాజును కోరారు. రాజుపరికరాలనన్నిటినీ సవ్యంగా అమర్చి ప్రయోగాలు చేసి చూపాడు.
    రాజు ప్రయోగాలు చేసి చూపుతుంటే విద్యార్థులూ-అధ్యాపకులూ కూడా ఒక ఐంద్రజాలికుడు ఇంద్రజాలం చేసి చూపిస్తున్నట్టుగా చూసి ఎంతో అబ్బుర పడ్డారు. అంతవరకూ చదువురాని మొద్దనుకున్న రాజును చాలా తెలివైన వాడిగా అందరూ గుర్తించారు.
    అప్పుడు జిల్లా వైద్యాధికారిగారికి పూర్తిగా అర్థమైంది. కేవలం బట్టీ పట్టి అప్ప చెప్పే బంద చదువుల్ని అమెరికాలో చెప్పరని. లోపం ఎక్కడుందో ఆయన గ్రహించారు.వెంటనే మాస్టర్లందరూ ఏడాదికోసారి వేసవి శలవుల్లో ప్రయోగాలు చెయ్యటం నేర్చుకుందుకు పట్నంలోని పెద్ద బడి అధ్యాపకుల వెళ్లాలని తాఖీదు ఇచ్చాడు.
    అప్పట్నించీ మాస్టర్లంతా ఉత్సాహంగా ఏడాదికోసారి పట్నం వెళ్లి,తమకన్నా ఎక్కువ తెలిసున్న వారి వద్ద ప్రయోగాలు చెయ్యడం నేర్చుకునొచ్చి వాటిద్వారా పిల్లలకి పాఠాలు చెప్పి,తమ విద్యార్థుల్ని ప్రయోజకుల్ని చేస్తూ విద్యా బోధన చేయ సాగారు.

  • మేలైన జీవితం My Stories-6.

    మేలైన జీవితం
    ఏప్రిల్ 1994 బాల మిత్రలో ప్రచురితం.

    by -పెయ్యేటి భువనేశ్వరి.*

    బాలూ కాన్వెంట్ లో యల్.కె.జి.చదువుతున్నాడు. అతనికి అమ్మ మీదా ,నాన్న మీదా చాలా కోపంగా ఉంది.ఎప్పుడూ చదువుకో,చదువుకో అంటారు. చదివింది గుర్తుంచుకుని వప్ప చెప్పమంటారు. లెక్కలు చెయ్యాలట,ఇంగ్లీషు ఝణ ఝణా మాట్లాడాలిట,ఫస్టు మార్కులు తెచ్చుకోవాలట. బాబోయ్! మనిషి జీవితం ఎంత కష్టం. హాయిగా ఏ పిల్లిగానో, కుక్క గానో పుట్టుంటే ఎంత బాగుండేది అని అనుకుంటుండగా బాలూ ముందు దేవుడు ప్రత్యక్షమై అతని ఇష్టం వచ్చిన జంతువుగా మారే వరాన్ని ప్రసాదించి మాయ మయ్యాడు.
    బాలూ తను పొందిన వరానికి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ముందుగా ఏ జంతువుగా మారాలా అనుకున్నాడు. అతనికి రోజూ తనతో ఆడుకునే పిల్లి గుర్తుకొచ్చింది. వెంటనే పిల్లిగా మారి పోయి చెంగున దూకుతూ వెళ్లి వాళ్ల అమ్మ కాలుని పట్టుకుని "మ్యావ్ ... మ్యావ్" అని అరుస్తూ నాక సాగాడు.
    "ఛీ! వెధవ పిల్లి" అని వాళ్లమ్మ బాలూని విదిలించి కొట్టింది.
    "ఛీ ఈ పిల్లి బతుకొద్దు. చక్కగా కుక్కగా మారితే పిల్లుల్ని బెదిరించి ఆనందించవచ్చు" అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో ,బాలూ కుక్కగా మారిపోయాడు.
    కుక్కగా మారగానే ముందు "భౌ!భౌ"మని అరిచాడు బాలూ. ఆ తరవాత వళ్లు విరుచుకున్నాడు గర్వంగా. భౌ భౌ మన్న అరుపు వినగానే ఆ వీధిలోని కుక్కలన్నీ వచ్చి బలూ మీద పడి కరిచేశాయి.
    కుక్క జీవితం బాగో లేదని,ఆకాశంలో ఎగిరే పక్షిలా మారాలని అనుకున్నాడు.అంతే ! అనుకున్నదే తడవుగా బాలూ పక్షిగా మారిపోయాడు.
    పక్షి జీవితం ఆనందంగా వుంది అని అనుకో బోయాడు. అంతలో ఒక డేగ వచ్చి పిట్ట రూపంలోనున్న బాలూని తరమ సాగింది.
    అదిరిపడి బాలూ పిట్ట బతుకొద్దు! చక్కగా ఏ చెట్టుకో పువ్వుగా వుంటే బాగుంటుందని,ఒక చెట్టుకి పువ్వుగా మారాడు.
    కాని ఎండ తీవ్రత ఎక్కువైంది. వళ్లంతా కాలుతున్నట్టు అనిపించి ఏడవ సాగాడు. "వద్దు ఏవుడూ! నాకా జీవితాలేవీ వద్దు. చక్కగా అమ్మ వడిలో వెచ్చగా పడుకుంటాను. అమ్మైతే వేళ పట్టున తిండి పెడుతుంది. అమ్మ నాకు పుట్టిన రోజు పండుగ చేస్తుంది. కోరిన పిండివంటలు చేసి పెడుతుంది. నాన్న కొత్త బట్టలు తెస్తాడు. అమ్మా నాన్నా ఇద్దరూ నన్ను ముద్దు పెట్టుకుంటారు. నన్నెంతో ప్రేమగా చూస్తారు. నాకు ఫస్టు మార్కులు వచ్చాయని అందరికీ గర్వంగా చెబుతారు. జ్వరమొస్తే నా గురించి ఏడుస్తారు. వైద్యుడికి చూపించి వైద్యం చేయిస్తారు. నాకు జ్వరం తగ్గాలని దేవుడికి దణ్ణాలు పెడతారు. నేను బాలూనై పోవాలి. ఎప్పటి లాగానే బాలూనై మా అమ్మా నాన్నల దగ్గరుండాలి దేవుడూ! మళ్లీ నన్ను బాలూగా మార్చెయ్యి!"అంటూ ఏడవ సాగాడు బాలూ.
    బాలూ వాళ్ల అమ్మ బాలూని తట్టి లేపింది. "ఏమిట్రా బాలూ! ఆ పలవరింతలు. దైనా పీడ కల వచ్చిందా? నా చిట్టి తండ్రీ! నీకేం భయం లేదు. నేను నీ పక్కలోనే వున్నాన్రా బాలూ" అని బాలూని వాళ్ల అమ్మ గుండెలకు హత్తుకుని ముద్దెట్టుకుంది.
    దూరపు కొండలు నునుపు అని అనుకుంటారు. మనిషి తను కష్టంలో వున్నప్పుడు తనకన్నా మిగతా ప్రాణులు సుఖంగా వున్నయనుకుంటాడు. కాని వాటికుండే ఇబ్బందులు ,కష్టాలూ వాటికున్నాయి. అందుకే,పీత కష్టాలు పీతకుంటాయి అని ఊరికే అన లేదు. ప్రపంచంలో అన్ని ప్రాణులకన్నా మనిషి అనే ప్రాణి మాత్రమే సుఖంగా వున్నాడని బాలూ తెలుసుకున్నాడు. ఆ విషయం తెలియని బాలూ అమ్మ బాలూ జడుసుకున్నాడనుకుంది.

  • ధన్యజీవి My Stories-5.

    ధన్యజీవి
    ఏప్రిల్ 1994 బుజ్జాయిలో ప్రచురితం.
    పెయ్యేటి భువనేశ్వరిశైలజ*

    రాము,సోము,గోపి ముగ్గురూ బాల్యంలో కలిసి చదువుకున్న మిత్రులు. అవడానికి ముగ్గురూ చాలా తెలివైన వారు. కాని పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్లు ముగ్గురూ వేరు వేరు జీవితాల్లో స్థిర పడ్డారు.
    రాము అంచెలంచెలుగా అభివృద్ధి చెంది జీవితంలో సైంటిస్టుగా స్థిర పడ్డాడు. అతనికి ప్రపంచ విఖ్యాత సైంటిస్టుగా బహుమతి రావడంతో అతని పేరు జగద్విఖ్యాత మైంది.
    సోము కూడా చాలా పెద్ద చదువులు చదివిఆడు కాని, అతను ప్రపంచాన్ని తార్కిక దృష్టితో చూస్తూ వైరాగ్యం అలవర్చుకుని సన్యాసిగా మారి,ధర్మోపదేశాలు చేస్తూ సోమానంద సరస్వతిగా పేరు తెచ్చుకున్నాడు.
    పాపం!.... గోపీ ఎంత చదువుకోవాలని తాపత్రయ పడ్డా;అతని తండ్రి చిన్న తనంలోనే గతించడంతో అతడు చదువుకు స్వస్తి పలికి ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడు. వ్యవసాయం చేస్తూ సామాన్య రైతు జీవితం గడిపేస్తున్నాడు.
    అనుకోకుండా ఒకరోజు విజయవాడ రైల్వే ప్లాట్ ఫారం మీద రాము-సోములు కలిశారు. ఆనందంగా జీవితంలో తాము తెచ్చుకున్న పేరు ప్రతిష్ఠలకు ఒకర్నొకరు పరస్పరం అభినందించుకుంటున్నారు. అదే సమయంలో గోపీ తన మనమరాలు లలితని తీసుకుని,నెత్తిమీద అరటి పళ్ల గెలతో రైలెక్కే ఉద్దేశంతో ప్లాట్ ఫారం మీద కొచ్చాడు.
    రామూ-సోమూలు గోపీని గుర్తు పట్టారు.
    "ఒరేయ్! వాడు మన గోపీలా వున్నాడురా!",అన్నాడు రాము.
    "గోపీలా వుండడమేమిటి? వాడు మన గోపీయే!"అన్నాడు సోము.
    ఇలా అనుకున్నదే తడవు వాళ్లు గోపీని గట్టిగా కేకేసి పిలిచారు. గోపీ వాళ్ల దగ్గర కెళ్లి నిల బడ్డాడు. వాళ్లిద్దరూ ఎవరో అర్థం కాక గోపీ వాళ్లని పరిశీలనగా చూస్తున్నాడు. రామూ-సోమూలు తమను తాము పరిచయం చేసుకుని,గోపీకి బాల్య స్మృతులని గుర్తు చేశారు. గోపీ తన మిత్రులు ఉన్నత స్థితిలో వున్నందుకు ఎంతో గర్వించాడు. వాళ్లు తనని మర్చిపోకుండా గుర్తుంచుకున్నందుకు ఎంతో ఆనందించాడు. అరటిగెలలోని కొన్ని పళ్లను వాళ్ల చేత తినిపించి,తాను తింటూ ఎన్నో విషయాలను అడిగి తెలుసుకుంటున్నాడు. పక్కనే మనమరాలుందనే విషయం కూడా మర్చిపోయాడు.
    రామూ,సోమూలు "ఎవర్రా అమ్మాయి?నీ మనుమరాలా?",అని అడిగి తెలుసుకుని బొద్దుగా అందంగా పట్టు పరికిణీలో వున్న లలితను దగ్గరకు తీసుకుని ముద్దాడారు.
    ఆ మాటా.... ఈ మాటా అయ్యాక సోమూ అన్నాడు "మన ముగ్గురిలో రామూ ధన్య జీవిరా! వాడు కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడమే కాకుండా,గొప్ప గొప్ప పరిశోధనలు చేసి నూతన విషయాలను కనుగొని ప్రజలకు తెలియ బర్చాడు" అని.
    "ఏం? నువ్వు మాత్రం ధన్యజీవివి కాదా? ఆధ్యాత్మిక చింతనతో ఎంతో ఎదిగావు. అందరికీ మర్గ దర్శకుడిగా వున్నావు!" అన్నాడు రాము.
    "పాపం! మన ముగ్గురిలో గోపీ జీవితం మాత్రం ఎందుకూ కొరగాకుండా పోయింది!" అని రామూ సోమూ లిద్దరూ .
    గోపీ మనమరాలు లలిత అడిగింది-"తాతయ్యా! ధన్య జీవి అంటే ఎవరు?" అని.
    "పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ పదిమందికీ సేవ చేసే వాడ్ని "ధన్యజీవి" అంటారమ్మా",అన్నాడు గోపీ తన మనమరాలితో.
    "పేరు ప్రఖ్యాతులు లేకుండా పదిమందికీ సేవ చేసే వాడు ధన్యజీవి కాడా తాతయ్యా",అడిగింది మళ్లీ లలిత.
    "పేరు ప్రఖ్యాతులతో నిమిత్తం లేకుండా దేశ సేవ చేసేవాడు కూడా ధన్య జీవేనమ్మా!, అన్నాడు గోపీ.
    "అయితే ,మీ ముగ్గురిలో ధన్యజీవి నువ్వే తాతయ్యా!", అంది లలిత.
    "అదెలా?" అంటూ రామూ సోమూతో పాటు గోపీ కూడా ఆశ్చర్య పోయాడు.
    (అదెలాగో ఊహించి మీరు ఈ కథకు ముగింపు రాయండి) ఇలా బుజ్జాయి వారు ప్రకటిస్తే- వచ్చిన నెగ్గిన ముగింపు.
    మా ముగింపు-
    "అవును తాతయ్యా! నువ్వు కష్ట జీవివి.రైతువి. పంటలు పండిస్తావు.పదిమందికి అన్నం పెడతావు. ఎంత పేరు ప్రఖ్యాతులున్న వాడికైనా ,తెలివైన వాడికైనా, తెల్లవారి లేస్తే కావల్సింది "తిండి!" ఆ తిండి లేకపోతే ,వాళ్ల బుర్రలు పనిచెయ్యవు.ఆలోచించలేరు. వాళ్ల తెలివి తేటలని గుర్తించే వారుకూడా నీలాంటి వాళ్లే తాతయ్యా! తిండి లేకపోఏ జనం చచ్చిపోతారు. చచ్చి పోయిన వారికి తెలివితేటలతోనూ,శాస్త్రాలతోనూ పని లేదు. అందుకే అందరికీ తిండి నందిస్తూ సామాన్య రైతు జీవితం గడుపుతున్న నువ్వు మీ ముగ్గురిలోనూ ధన్య జీవివి తాతయ్యా!" అని తేల్చి చెప్పింది లలిత.
    రామూ,స్పమూ లకు ఆవరించివున్న మైకం అనే మహామాయ తొలగి పోయింది. వారి కంటికి లలిత చిన్న పిల్లలా కనిపించ లేదు. ఒక మహాశక్తి లలితాంబికగా కనిపించింది. వారిద్దరూ లలితని ఎత్తుకుని ముద్ద్దు పెట్టుకుని "అవునమ్మా! నువ్వు చెప్పింది నిజం! మా కళ్లకున్న పొరలను తొలగించావు. నువ్వు సాక్షాత్తూ లలితాదేవివేనమ్మా!" అన్నారు.

  • నడిచే మొక్కలు నిలిచాయి! My Stories-4.

    నడిచే మొక్కలు నిలిచాయి!
    పెయ్యేటి భువనేశ్వరి & శైలజ*

    భూగోళం ఇరవైమూడో శతాబ్దంలోకి పరుగు తీసింది. జనం డార్విన్ సిద్ధాంతాన్ని హేళన చేశారు. జీవపరిణామ క్రమంలో మనిషి మరో రూపం లోకి మారక పోవడం వల్ల డార్విన్ సిద్దాంతం తలుచుకుని జనం నవ్వుకుంటున్నారు.అప్పుడే ఈ వింత జరిగింది.
    మనుష్యులు తమ వయస్సుల్ని కప్పి పెట్టుకోవడానికీ,ఎప్పుడూ యుక్త వయస్సులో వున్నట్లు కనిపించడానికీ ఎన్నెన్నో ప్రక్రియలు ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నారు. పుట్టిన పిల్లలకు తలకట్టు నిగ నిగలాడుతూ నల్లగా వుంటే, వయసు మళ్లి వార్థక్యం వస్తోంటే తెల్ల బడి పోతుంటే జుట్టుకు నలుపు రంగు వేసుకుంటున్నారు.. కాని ఆశ్చర్యంగా పుట్టిన పిల్లలకు పండు జుట్టు వుండి రాను రాను వయసు మళ్లే కొద్దీ నల్ల బడ సాగింది. దాంతో జనం జుట్టుకు తెల్ల రంగు వేసుకోవటం మొదలెట్టారు. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేటందుకు కొందరు రక రకాల రంగులు జుట్టుకు పట్టిస్తున్నారు.
    విజ్ఞాన శాస్త్రం వెర్రి పోకడలు పోయింది. అడవులు ధ్వంస మయ్యాయి. పారిశ్రామీకరణ వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగి పోయింది. ప్రాణ వాయువు శాతం తగ్గింది. కరవు కాటకాలు ప్రబలాయి. మనిషి తిండి లేకుండా బ్రతగ్గలిగితే ఎంత బాగుడును? అనుకున్నాడు. అలాగే బొగ్గుపులుసు వాయువుతో మనిషి బతక లేడా అనుకున్నాడు.
    ఇంకేముంది? విపత్కర పరిస్థితులను తట్టుకుని మనిషి బతికేటందుకు శాస్త్ర వేత్తలు తలలు బద్దలు చేసుకుంటూ ప్రయోగ శాలల్లో కూచున్నారు. వాళ్ల ప్రయోగాలు పూర్తి కాలేదు. కాని,ఒక అద్భుతం జరిగింది.
    ఒక మనిషి కెమికల్ రంగులు తలకి పట్టించుకోకుండా ,ప్రకౄతి సిద్ధంగా వుండే రంగుని ఎందుకు వాడ కూడదు? అనుకున్నాడు. మొక్కల్లో వుండే ఆకు పసరుని తీసుకుని తలకి పట్టించుకున్నాడు. దాంతో ఆకుల్లో వుండే క్లోరోఫిల్ అతని జుట్టులో ఇంకి పోయింది. అతను ఎండలో నుంచునే సరికి కిరణ జన్య సంయోగ క్రియ ప్రారంభమైంది. అతనికి తిండితో అవసరం లేకపోయింది. అతను
    బొగ్గుపులుసు వాయువును పీల్చి ప్రాణ వాయువును విడుదల చెయ్య సాగాడు. అతడ్ని శాస్త్ర వేత్తలు పరీక్షలకు గురి చేశారు. మనిషి ఈ పద్ధతిలో విపత్తుని అధిగమించ వచ్చని తేల్చారు.
    జనం వేలం వెర్రిగా నడిచే మొక్కలుగా మారారు. తిండి అక్కర్లేదు. బొగ్గు పులుసు వాయువు తో బతకడం బాగుందనుకున్నారు.
    అప్పుడో తంటా వచ్చింది. చీకటి పడేసరికి నడిచే మొక్కలుగా వున్న మనుష్యులు విలవిల లాడారు.చీకట్లో వాళ్లకి ప్రాణ వాయువు అవసరమయ్యేది. రాత్రిళ్లు బొగ్గు పులుసు వాయువు విడుదల చెయ్యాల్సొచ్చేది. ఇళ్లల్లో కూచుంటే భరించలేని ఉక్క పోతగా వుండేది. అందుకే రాత్రుళ్లు నడిచే మొక్కలుగా రోడ్ల మీదే తిరగటం మొదలెట్టారు. పగటి పూట కిరణ జన్యసంయోగ క్రియ కోసం ఎలాగూ రోడ్ల మీదే వుండాల్సొచ్చేది. వారికి ఇళ్లు అవసరం లేకుండా పోయాయి. బట్టలు వేసుకుంటే భరించలేని బాధగా వుండటంతో బట్టలు కూడా లేకుండా తిరిగే వారు. అంటే,మనిషికి కూడూ,గుడ్డా,గూడూ అవసరం లేకుండా పోయాయి!
    బాగానే వుంది కానీ, ఈ నడిచే మొక్కలకి నిముష నిముషానికీ నీళ్లు తాగవలసిన అవసరం వచ్చింది. అయటినించి ఖనిజ లవణాల్ని తీసుకోవల్సి వచ్చింది. అందుకే మినరల్ మిశ్రమం వున్న నీళ్ల సీసాలు పట్టుకుని రోడ్ల మీద తిరిగే వారు. నీళ్ల కోసం వర్షం కోసం అల్లల్లాడే వారు. నదుల దగ్గరికీ చెరువుల దగ్గరికీ పరిగెత్తేవారు.
    ఇదీ కష్ట మనిపించింది. ఎంతైనా మనిషి తెలివైన వాడు కదా? అందుకే మోకాలు లోతు గోతులు తవ్వుకుని ,మట్టి కప్పుకుని నిలబడ్డం మొదలెట్టారు. అప్పుడు భూమిలోంచి నేరుగా పాదాలు నీటినీ,ఖనిజ లవణాల్నీ పీల్చుకోవడం మొదలెట్టాయి. అవసరమైన ప్పుడు భూమిలో దిగబడ్డం ,అవసరం లేదనుకున్నప్పుడు నడవడం మొదలెట్టారు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికి ఆ నడిచే మొక్కలు మనుష్యుల శరీరం ఖనిజ లవణాలు బయటకు పోకుండా బెరడు కట్టడం మొదలెట్టాయి. రాను రాను వారు ఇటూ అటూ నడిచి శరీరంలోని ఆహార పదార్థాల్ని వృధా చేసుకోకుండా ఒక చోట భూమిలో సుఖంగా నిలబడ్డం మంచిదనుకున్నాడు మనిషి. ఎక్కడి వారక్కడే భూమిలో దిగ బడి నిలబడి పోయారు. వాళ్ల పాదాల్నించి వేళ్లు పొడుగ్గా సాగించి భూమిలోనించి నీటినీ ఖనిజ లవణాల్నీ పీల్చుకోవడం మొదలెట్టాయి. వాళ్లు పూర్తిగా మొక్కల్లాగా చెట్లు లాగా మారారు. ఇలా కొందరు చెట్లుగానూ,మొక్కలుగానూ మారడంతో మిగిలిన జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే వారికి కావల్సిన ఆహారం ,ప్రాణ వాయువూ మొక్కలుగా మారిన మనుష్యులు అందిస్తున్నారు.
    మనుష్యులు ఎలాగూ కదలటం లేదుగా ఈ మనిషిమొక్కలను వారిని తిరిగే మనుష్యులు హింసించడం సాగించారు. అన్యాయాలు చేస్తున్నారు. ఇవి చూడలేక ఆ మనిషిమొక్కలు కళ్లు మూసుకున్నారు. బాధతో అరిచి అరిచీ మనిషి మొక్కల నోళ్లు మూత పడిపోయాయి.
    అప్పుడు శాస్త్ర వేత్తలు అర్థం చేసుకున్నారు. జీవ పరిణామ క్రమంలో వాతావరణాన్ని కాలుష్య పరిస్తే, మనిషి "ఎమీబా"గా మారిపోగల అవకాశాలున్నాయని. మనిషి మళ్లీ కోతిగా మారచ్చు .చెట్టుగా మారచ్చు. అందుకే వాతావరణాన్ని కాపాడాలని అనుకున్నారు.
    పాపం! మన పూర్వీకులెవరో చెట్లగా మారి మనకి సేవలు చేస్తున్నారని అర్థమైంది శాస్త్రజ్ఞులకు . గతంలోకూడా ఇలాగే జరిగుంటుందని పుస్తకాల్లో రాసుకున్నారు.
    అందుకే చెట్లను నాశనం చేసి మన పూర్వీకుల్ని చంప కూడదు. దాని వల్ల ఎన్నో అనర్థాలొస్తాయి. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుందామని ప్రస్తుత కాలం మనుష్యులు ఊరూరా ,ఇంటింటా,చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

  • కోయిల పాట -My stories-3.

    కోయిల పాట
    -పెయ్యేటి భువనేశ్వరి*
    బొమ్మరిల్లు లో ప్రచురితం.

    అడవిలో జంతువులన్నీ రోజూ రాత్రయ్యేసరికి ఒక చ్ట్టు కింద సమావేశమై కబుర్లాడుకునేవి. పగలు ఒకరికొకరు శత్రువులైనా రాత్రి మాత్రం ఒకే దేశ పౌరుల్లా మసలేవి.
    అలా ఓ వసంత కాలపు వెన్నెల రాత్రి జంతువులన్నీ ఒక చోట చేరగా ఎవరు గొప్ప అనే ప్రసక్తి వచ్చింది. వెంటనే పిల్లి మ్యావ్ మంటూ తన గొప్పతనాన్ని చెప్పి,అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను అని ఋజువు చేసింది.
    అప్పుడు పెద్ద పులి ఘాండ్రిస్తూ నవ్వి,"మన జాతి గొప్పదే. కాని ఆ జాతిలోకెల్లా నేను గొప్ప దాన్ని. నువ్వు ఎలుకల్ని తింటావు. నేను పెద్ద పెద్ద జంతువుల్నే కర కరా నమిలేయ గలను.పైగా పార్వతీ దేవి వాహనాన్ని",అంది.
    "దేవతల గురించి చెప్పాలంటే నువ్వు వాహనానివేమో గానీ నేను సరాసరి విష్ణు మూర్తి అవతారాన్ని తెలుసా?",అంది పంది.
    అప్పుడు ఏనుగు ఘీంకరించి,"వాళ్ల పేరూ వీళ్ల పేరూ చెప్పుకునే మీరేమిటి గొప్ప? స్వతహాగా శక్తి మంతురాలినైన నేనే గొప్ప?",అంది.

    పాము ఏనుగును ఒక్క కాటుతో చంపగలనంది. పామును లెక్క చేయనని నెమలి అంది. పామునీ,నెమిలినీ ఒక్క దెబ్బతో చంపగలనంది ముంగిస.
    "అన్నిటి కంటే గొప్పది తెలివి. నా జిత్తులముందు మీ రెవ్వరూ ఆగ లేరు. నేనే గొప్ప దాన్ని ",అంది నక్క.
    "ఎన్ని జిత్తులున్నా,ఎంత తెలివి ఉన్నా ధైర్యం లేక పోతే వృధా!",అంటూ తోడేలు అరవగానే నక్క తోక ముడుచుకుంది.
    ఇలా ప్రతి జంతువూ ముందుకోచ్చి స్వంత గొప్పలు చెప్పుకుంటూంటే చిరాకు వేసి సింహం పెద్ద పెట్టున గర్జిస్తూ, "ఈ అడవికి రాజునైన నేనుండగా మీరు ప్రగల్భాలేమిటి? ఇక్కడ నన్ను చికాకు పెట్ట గలవారెవరైనా ఉన్నారా?" ,అంది.
    అక్కడ చేరిన జంతు పశు పక్ష్యాదులన్నీ భయంతో నోరు మూసుకున్నాయి. అంతలో ఎక్కణ్ణించో ఝంకారం వినిపించింది. తుమ్మెదల గుంపు ఒకటి చప్పున వచ్చి సింహాన్ని చుట్టు ముట్టింది. సింహం వాటి నీంచి తప్పించుకో లేక చీకాకు పడుతుంటే అడవి జీవులన్నీ నవ్వ సాగాయి.
    అలాగే తెల తెల వారుతోంది. ఎవరు గొప్ప అన్న చర్చను అప్పటికి వాయిదా
    వేయాలనుకుంటూండగా , ఎక్కడినించో తీయని పాట! అది లేత మామిడి చిగుళ్లను తిన్న పరవశంలో పంచమ స్వరంలో ఎలుగెత్తి కోయిల పాడుతున్న పాట!
    అడవి జీవులకు కోయిల తెలియదు. కానీ ఆ పాటకు అవన్నీ మైమరచి పోయాయి. పాట ఆగేదాకా వాటికి ప్రపంచం తెలియ లేదు. అప్పుడు అడవి జీవులన్నీ ఏక కంఠంతో, "ఈ పాట పాడిందెవరో కానీ మా అందరికంటే గొప్ప. ఒక్క సారి మా కళ్లముందుకొచ్చి కనబడితే ఆనందిస్తాం. సన్మానం చేస్తాం",అన్నాయి.
    కోయిలకు తీయని గొంతు గురించి గర్వం లేదు. నల్లని తన రూపుకు మాత్రం సిగ్గు పడుతుంది. అందుకే అది చెట్ల ఆకుల చాటునుంచి బయటకు రాలేదు.
    అంతలో కావు కావు మని అరుస్తూ కాకి వచ్చి, "దానికి సన్మానమా? అదెవరనుకున్నారు? నా కూతురే! పేరు కోయిల. చిన్నప్పుడు నేను పాడినంత చక్కగా పాడలేక పోయిందని కోపమొచ్చి నా గూట్లోంచి తరిమేశాను. ఆ పాట మీకు నచ్చిందా?",అంది.
    అడవి జీవులన్నీ అదే పనిగా నవ్వి, "ఆ మధుర గాయని నీ కూతురంటే ఎవరూ నమ్మరు", అన్నాయి.
    "నేను నిజం చెబుతున్నాను. ఎందుకు
    నమ్మరు?",అంది కాకి.
    అప్పుడు సింహం లేచి గర్జిస్తూ ,"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః అంటారు. కోయిల గానం విని మేమంతా పరవశించాం నువ్వు పరవశించలేదు సరికదా ఆ పాట నీకు నచ్చలేదని కూడా చెప్పావు. ఆ కోయిలే వచ్చి చెప్పినా అది నీకు వారసులంటే నమ్మం. కోయిల కోయిలే - కాకి కాకే!",అంది.

  • మేలు కొలుపు my stories-2.

    మేలు కొలుపు (బుజ్జాయిలో ప్రచురితం)
    పెయ్యేటి భువనేశ్వరి & శైలజ

    శివుడు వుంటున్న్ ఊరు శుద్ధ పల్లెటూరు.ఆ ఊళ్లో వుంటున్న వాళ్లల్లో నూటికి తొంభై తొమ్మండుగురు నిరక్షరాస్యులు . ఆ ఊళ్ళో కూడా ఒక బడి వుంది. అందులో ఏడవ తరగతి వరకూ పాఠాలు చెబుతారు. అయినా ఊళ్లో ఎవరూ తమ పిల్లల్ని బడికి పంపరు. ఎక్కువగా పిల్లల్ని పనీ పాటల్లో వుంచి ,పొలంపనుల్లో
    తల్లిదండ్రులు సాయం చేయించుకుంటూ వుంటారు.
    అయితే శివుడి తండ్రి తను చదువుకోక పోయినా ,చదువన్నా చదువుకున్న వాళ్లన్నా ఎంతో గౌరవం. అందుకే శివుడ్ని పనుల్లో దింపకుండా రోజూ బడికి పంపించి చదివిస్తున్నాడు. నిజానికి శివుడికి చదువంటే ఆసక్తి లేదు.తన తోటి పిల్లలు గొడ్లు కాస్తూ,గూటీ బిళ్లలూ,కోతి కొమ్మచ్చులూ ఆడుకుంటూ వుంటే తనొక్కడూ బడికెళ్లి చదువుకోవాలంటే ఏడుపొస్తోంది. అయినా,తండ్రికీ- మాస్టర్లకీ భయపడి రోజూ బడి కెళ్లే వాడు. రోజూ బడి కెళ్లడం వల్లా,తప్పని సరిగా చదవడం వల్లా శివుడు ఏడో తరగతి పాసయ్యాడు.
    ఏడో తరగతి పాసయ్యాక శివుడి తండ్రి శివుడ్ని తీసికెళ్లి పట్నంలోని బళ్లో చేర్పించాడు. శివుడు పట్నంలోనే ఒక గది అద్దెకి తీసుకుని విడిగా వుంటూ చదువుతున్నాడు.
    శివుడికి పట్నంలో ఇప్పుడు ఎక్కడ లేని స్వతంత్రం వచ్చేసింది.
    పట్నంలో తనని అడ్డు పెట్టే వారెవరూ లేరు. నాన్న ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పల్లెటూరి నించి పంపుతున్నాడు. అందువల్ల శివుడు తనకి దొరికిన స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్య సాగాడు. రోజుకో సినిమా చూడ్డం,గదికి అశ్లీల పుస్తకాలు తెచ్చి చదవటం ,దుస్సాంగత్యంతో కాలక్షేపం వ్యసనాల్లో పడ్డం కూడా మొదలెట్టాడు.
    ఇలా వుండగా దీపావళి సందర్భంగా బడికి సెలవలిచ్చారు. శివుడికి సెలవుల్లో ఇంటికెళ్లడం ఇష్టం లేదు. ఇంటికెడితే తనకున్న స్వేచ్ఛ పోతుంది. అందుకే,తండ్రికి దీపావళికి రావటం లేదనీ,సెలవల్లో కూడా ఇక్కడ మాస్టర్లు పాఠాలు చెబుతున్నారని అర్జంటుగా డబ్బు పంపమనీ ఉత్తరం రాశాడు.
    పాపం!శివుడి తండ్రి సుబ్బయ్యకి శివుడి మీద ఎంతో జాలేసింది.సెలవల్లో కూడా బిడ్డడు ఎంతో కష్టపడి చదివేస్తున్నాడు. ఇలాగైతే వాడి ఆరోగ్యం పాడైపోతుందనిపించి తానే స్వయంగా పట్నం వెళ్లి బిడ్డడి బాగోగులు చూడాలని డబ్బు తీసుకుని,రకరకాల మిఠాయిలను చేయించి మూట కట్టుకుని పట్నం చేరాడు సుబ్బయ్య.
    చెప్పా పెట్టకుండా వచ్చిన తండ్రిని చూడగానే శివుడు ఖంగు తిన్నాడు .కొద్దిగా ఖంగారు పడ్డాడు. అయినా,చదువురాని తండ్రి ముందు తనకేం భయమని ధైర్యం తెచ్చుకున్నాడు.అందుకే అన్నాడు -"ఏమిటి నాన్నా? ముందుగా
    తెలియబర్చకుండా వచ్చేశావు? డబ్బు పంపిస్తే సరిపోయేదిగా?"అన్నాడు.
    "అదికాదురా అబ్బాయి! నిన్ను చూడాలనిపించి న్వచ్చేశన్రా!పాపం మీ అమ్మ నువ్వు తింటావని ఎంతో కష్ట పడి ఈ మిఠాయిలన్నీ చేసి పంపించిందిరా!",అన్నాడు సుబ్బయ్య.
    "ఆ! ఏమిటో చాదస్తంగాని డబ్బులుంటే పట్నంలో దొరకని దేముంటుంది నాన్నా! ఇక్కడ మిఠాయిలకేంకొదవ?"అన్నాడు శివుడు.
    "అదేమిట్రా అలాగంటావా? ఇక్కడ నువ్వు కొనుక్కునే మిఠాయిల్లో మీ అమ్మ స్వయంగా చేసిచ్చిన ఆప్యాయెతెక్కడుంటుందిరా! అది సరే! నీ చదువెలా సగుతోంది? ఏవీ నీ పుస్తకాలొకసారి చూడనీ !",అన్నాడు సుబ్బయ్య.
    "నా పుస్తకాలేం చూస్తావు నాన్నా? ఒకవేళ చూసినా నీకేమి అర్థమౌతుంది? ఇంత చదువుకున్న నేనే ఆ పుస్తకాల్ని చదివి అర్థం చేసుకో లేక చస్తున్నా.కావాలంటే చూడు .అదుగొ ఆ గూట్లోనే వున్నాయి పుస్తకాలు.అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే!",అన్నాడు శివుడు.
    సుబ్బయ్య వెళ్లి కొడుకు చదువుతున్న పుస్తకాలు గూట్లోంచి తీసి చూడ సాగాడు. ఆ పుస్తకాలు చూడగానే సుబ్బయ్య కళ్లు కోపంతో ఎరుపెక్కాయి.
    "ఏమిట్రా ఈ పుస్తకాలు? వీటి నిండా ఏమిటీ వెధవ బొమ్మలు?!",కోపంగా అడిగాడు సుబ్బయ్య.
    "అదంతేలే నాన్నా!నీకుతెలీదు.సైసు పాఠాలు.",అన్నాడు ధైర్యంగా శివుడు.
    అలాగా?!....అని ,సుబ్బయ్య ఆ ఇంగ్లీషు పుస్తకల్లో దాచి వున్న తెలుగు అశ్లీల సాహిత్యాన్నంతటినీ గడ గడా చదవసాగాడు.
    "నాన్నా ?!ఏమిటి? ....నువ్వూ....?!" అంటూ శివుడు భయంతో కొయ్య బారిపోయాడు.
    "ఒరేయ్ నాయనా! ఈ సంవత్సరం మన పల్లెలో వయోజన విద్యా కేంద్రం పెట్టారు. ఈ పది నెలల్లో నేనూ ఆ విద్యా కేంద్రంలో బాగా చదవటం,రాయటం నేర్చుకున్నాను.పగలంతా పొలం పని రాత్రి చదువుకున్నాను. ఇంకో సంవత్సరం పోతే నీ ఇంగ్లీషు పుస్తకాలు గూడా చదివేస్తాను తెలుసా? దొంగ రాస్కెల్!పట్నంలో వుండి బుద్ధిగా చదువుకోరా నాయనా అని పంపిస్తే ఈ బూతు
    బొమ్మల సాహిత్యం ,సినిమాలు,చెడు అలవాట్లు,చెడు స్నేహితులతో తిరగటం మొదలెట్టావన్న మాట!",అని కొడుకును మెత్తగా తిట్టేశాడు.
    తన బండారం అంతా తండ్రికి తెలిసి పోయిందని గమనించిన శివుడు "నాన్నా! క్షమించు ఇంకెప్పుడూ ఇలా చెయ్యను. బుద్ధిగా చదువుకుంటాను. ..!"అని కన్నీళ్లు పెట్టుకుని ప్రాథేయ పడ్డాడు.
    "సరే...!శెలవలిచ్చారుగా దీపావళికి అక్కా బావ వచ్చారు. యింటికి పోదాం రా!",అని తండ్రి గదమాయించేఅరికి శివుడు నోరు మూసుకుని తండ్రితో బయల్దేరి వచ్చేశాడు. ఇంట్లో తల్లి,అక్క,బావ,తండ్రి అందరూ కలిసి కూర్చుని శివకు బ్రైన్ వాష్ యిచ్చారు. వారు యిచ్చిన వాష్ తో శివ చెడు అలవాట్లు మానేసి స్కూల్లో ప్రతి సంవత్సరం ఫస్టు మార్కులతో ప్యాసవుతూ ఉత్తమ విద్యార్థిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

  • గోళీ లాట stories.Second prize won story..

    గోళీ లాట
    పెయ్యేటి భువనేశ్వరి & పెయ్యేటి శైలజ*

    రాము,సోము అన్నదమ్ములు. వాళ్లు చదువుమీద శ్రద్ధ లేకుండా బడికి ఎగ్గొట్టి గోళీ లాడుకుంటూ రోడ్ల మీద తిరుగుతుండే వారు.
    వాళ్లని ఎన్నో సార్లు మందలించాడు తండ్రి సుబ్బయ్య. అయినా వాళ్ల గో గోళీలాట పిచ్చి తగ్గటం లేదు. శ్రద్ధగా చదవటం లేదు.
    ఒక రోజు సుబ్బయ్యకు సుందరం మాష్టారు ఎదురు పడ్డారు.
    సుబ్బయ్య తన గోడును చెప్పుకున్నాడు. "మాష్టారు!ఇక వాళ్లని మందలించటం నా వల్ల కావటం లేదు. తిడితే వినిపించుకోవతం లేదు. కొడితే బండ బారిపోతున్నారు. గోళీలాటలు మానడం లేదని చెప్పాడు.
    సుందరం మాస్తారు చాలా తెలివైన వారు. పిల్లల్ని కొట్టకుండానే వాళ్లకి చదువుమీద శ్రధ కలిగేలా పిల్లల మనస్టత్వాన్ని బట్టి ప్రవర్తిస్తూ చదువు చెబుతుండే వారు.
    "సుబ్బయ్యా ఓ పని చెయ్ ... రేపు ఉదయాన్నే మీ పిల్లలను మా యింటికి పంపించు." అని చెప్పారు సుందరం మాస్టరు.
    మర్నాడు ఉదయాన్నే సుబ్బయ్య పిల్లలను లేపి, పెరట్లో బెండకాయలు,ములక్కాడలు కోసి వాటిని సుందరం మాస్టారుకు ఇచ్చి రమ్మన్నాడు.
    ఇవి తీసికెళ్లిన మంచితనంతో మరో రెండ్రోజులు బడి ఎగ్గొట్టినా మాస్టారు తిట్టరుకదా అనే ధీమాతో వెళ్లారు రాము,సోము.
    రాము,సోముల్ని చెరో ప్రక్కనా కూచో బెట్టుకున్నారు మాస్తారు."ఏవర్రా!ఈ మధ్య మీరిద్దరూ సరిగా బడికి రావటం లేదు"అన్నారు.
    రాము,సోము ఏవీ మాట్లాడకుండా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
    అంతలో సుందరం మాస్టారు బెండకాయలను మధ్యకు విరవ సాగారు.
    "అదేంటి మాష్టారూ.. బెండకాయలను విరిచేస్తున్నారు",అడిగారు.
    "ఇందులో గోళీలుంటాయిరా"
    "బెండ కాయల్లో గొలీలా... అవి గింజలు మాస్టారూ"
    "అవేరా .. అవి దేవుడు పెట్టిన గోలీలు. ఈ గోళీలను భూమిలో పాతితే తిరిగి మొక్కలు,వాటిలో గోలీలొస్తాయి.నాకు చిన్నప్పటినుండీ గోళీలంటే మహా ఇష్టం. అందుకే గుండ్రంగా వుండే వాటి నన్నిటినీ గోళీలనే అంటుంటాను."
    "అయితే మీరు చిన్నప్పుడు గోలీలాడేవారా మాస్టారు?"
    "ఆ..! గోళీలాడుతూనే ఎన్నో విషయాలను తెలుసుకున్నాను."
    గోళీలాట మీద మాస్టారి ప్రస్థావన వచ్చేసరికి రామూ,సోమూలకు బోలెడంత ఉత్సాహం పుట్టుకొచ్చి మాస్టారు చెప్పేవాటిని శ్రద్ధగా విన సాగారు.
    "గోళీల వల్ల చాలా లాభాలున్నాయిరా"
    "గోళీల వల్ల లాభాలా? .. అవేంటో అసలు మాకు తెలీనే తెలీవు మాస్టారు"
    "అందుకే మీకు చదువు వంట బట్టటం లేదు. ఆ లాభాలు ఏవిటన్నది తెలుసుకోవాలంటే మీరు బాగా చదువుకోవాలి. ఈ గోళీల తోనే గొప్పవాళ్లైన వారెందరో వున్నారు. గోళీల్లో గోల చాలా వుంది!"
    "అదేంటో చెప్పండి మాస్టారూ"
    సోడా సీసాలో గోళీకాయ ఉంటుంది. చూశారు కదూ! దాన్ని బయటకు తియ్యలేం. ఎందుకంటే, సీసా మూతికి రబ్బరు అడ్డంగా వుంటుంది. సీసా పీక దగ్గర రెండు వొత్తలుంటాయి కాబట్టి గోళీ క్రిందకు పడకుండా ఉంటుంది. ఆ సీసా ఎందుకలా తయారు చేశారో తెలుసా మీకు?"
    "తెలీదు మాస్టారూ"
    "అందుకే మనిషికి విజ్ఞానం అవసరమన్నారు. చదువుకుంటేనే విజ్ఞాన వంతులవుతారు.చదువుకోబట్టే శాస్త్రజ్ఞులు సోడా సీసాను కనిపెట్ట గలిగారు. సోడా సీసాలో నీళ్లు పోసి అందులో బొగ్గుపులుసు వాయువు నింపుతారు. ఆ వాయువు సీసాలోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ సీసాలోని గోలీ రబ్బరుకు అడ్డుకుని గట్టిగా మూతలాగ వుండి పోతుంది.వాయువు వత్తిడి వలన క్రిందకు కూడా జారకుండా వుంటుంది. ఇలా ఎన్ని రోజులైనా సీసాలో సోడా వుంటుంది. మనం సోడా తాగేటప్పుడు గోళీని గట్టిగా కిందకు నొక్కుతాం. రబ్బరుకు సంకోచ వ్యాకోచాలుంటాయి కాబట్టి గోళీ క్రిందికి దిగి "కుయ్" మనే శబ్దంతో గ్యాస్ బయటకు వస్తుంది."
    "భలే భలే . . మేమెప్పుడూ దీనిగురించి ఆలోచించలేదు మాస్టారూ! గోళీ వలన సీసాలోని గ్యాస్ బయటకు పోకుండా అడ్డు కుంటుందన్న మాట."
    " ఇవే గోళీలను కొన్ని చెడు పనులకు కూడా ఉపయోగిస్తారు.వాటిని మందు గోళీలంటారు. పేలే పదార్థాలతో గోళీల్లా వాటిని తయారు చేస్తారు. ఈ మందు గోళీలను చిన్నవిగా చేసి తుపాకుల్లోతూటాలుగా వాడతారు.పెద్దవిగా చేసి యుద్ధాలప్పుడు ఫిరంగుల్లో వాడతారు. అవి మనుష్యుల్ని చంపుతాయి.

    "అమ్మో.. అవి గోళీలేనన్న మాట",అన్నారు అన్న దమ్ములిద్దరూ.
    "సైకిళ్లలోనూ,మోటారు సైకిళ్లలోనూ, కార్లు మొదలైన వాటి చక్రాల్లో కూడా గోళీలు ఉపయోగిస్తారు. ఇవి ఇనప గోళీలు. వాటిని బాల్స్ అంటారు."
    "వాటిలో ఎందుకు మాస్టారూ?"
    "చక్రాల బేరింగుల్లో ఈ ఇనప గోళీలుంటాయి. ఈ బేరింగుల్లో గ్రీజు పూస్తారు. చక్రం కదిలేటప్పుడు ఈ గోళీలు ఒకదానికి ఒకటి ఒరుసుకుంటూ సున్నితంగా వేగంగా చక్రం తిరిగేట్టు చేస్తాయి."
    "ఇనుపగోళీలు లేకపోతే చక్రం తిరగదా మాస్టారూ?"
    "కదులుతుంది కానీ వేగం వుండదు.మొట మొదట్లో సైకిళ్లు ఈ గోళీలు లేకుండా వచ్చేవి. సైకిలు తొక్కేవారు చాలా కష్ట పడేవారు. ఆ తరవాత చదువుకున్న వారు పరిశోధనలు జరిపి గోళీలతో నడిపే పద్ధతిని కనిపెట్టారు."
    "భలే ఆశ్చర్యంగావుందే!"
    "ఇందులో ఆశ్చర్య మేముందర్రా? ఇది సైన్సు. బాగా చదువుకుంటే మీరూ ఇలాటివి ఎన్నో కనిపెట్టచ్చు.ఇవాళ స్ఫుట్నిక్ లూ,ఉప గ్రహాలూ .. .. .. ఇవన్నీ కూడా గోళాకారం లోనున్న పెద్ద గోళీలే. బాగా చదువుకుని విజ్ఞాన వంతులైన వాళ్లు వీటిని కనుగొని గొప్ప వ్యక్తులుగా ప్రపంచంతో పొగడ బడుతున్నారు."
    "గోళీల గురించి మీరు ఎన్నో విషయాలు చెబుతున్నారు.ఇవన్నీ మీకు ఎలా తెలిశాయి మాస్టారూ?"
    "చిన్నప్పటి నుండీ గోళీలతో ఆడి కాలాన్ని వృథా చెయ్యకుండా,గోళీల గురించి తెలుసుకునేందుకు ఎంతో చదువుకున్నాను. గోళీల గురించి ఇష్టమంటే,ఆడి టైము పాడు చేసుకోవటం కాదు. వాటి గురించి తెలుసుకోవట మన్న మాట. మీరు చూడండి. గోళీలాడుకుంటూ బడి ఎగ్గొట్టి కాలాన్ని వృథా చెయ్యటం వలన ఏ విషయాన్నీ తెలుసుకో లేక పోతున్నారు.విజ్ఞానాన్ని పొందలేక పోతున్నారు."
    "నిజమే మేస్టారూ ... మేము గోళీలగురించి ఏమీ తెలుసుకోలేక పోయాం.ఇప్పుడే వాటి గురించి తెలుసుకోవాలనిపిస్తోంది."
    "అవునర్రా అదే ఎంతో ప్రయోజనం.మీకు దేవుడు గోళీలు తెలుసా?"
    "దేవుడు గోళీలా?" ... అదేంటి మాస్టారూ?"
    " మన భూమి ఒక గోళీ.. చంద్రుడు కొంచెం చిన్న గోళీ. సూర్యుడు చాలా పెద్ద గోళీ.. ఇలా తతిమ్మా గ్రహాలన్నీ గోళీలే. భూమి అనే గోళీని దేవుడు ఎప్పుడో "స్పిన్ బౌల్ " చేసి శూన్యంలో వదిలేశాడు. అంటే అప్పటి నుండీ భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోంది. అందుకే రాత్రి పగలు కలుగుతున్నాయి మనకు..! ఇలా గోళీలల్లోనే ఎంతో విజ్ఞానం దాగుంది. ప్రతి విద్యార్థీ ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి బాగా కష్ట పడి చదవాలి. అందువల్ల మీరు ఈ ఆటలకు పనికొచ్చే గోలీలతో ఆడుకోకుండా ,బోలెడు పుస్తకాలని చదివి గోళీలోని విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడే పైకొస్తారు. గోళీల ద్వారా కొత్త పరిశోథనలు చెయ్యండి . అప్పుడు విజ్ఞాన వంతులుగా మిమ్మల్నందరూ మెచ్చుకుంటారు."
    "ఇప్పట్లా రోడ్ల మీద గోళీ లాడుకుంటూ తిరిగితే, అందరూ మిమ్మల్ని చదువు సంధ్యలు లేని మొద్దులంటారు. అందుకే "చదువు రాని వాడు వింత పశువు" అంటారు పెద్దలు" అంటూ వివరంగా సున్నితంగా చెప్పారు సుందరం మాస్టారు.
    రామూ,సోమూకు సుందరం మాస్టారు బోధన ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. అప్పటి నుండీ బాగా చదువుకుని గొప్ప వాళ్ల మవ్వాలనే పట్టుదల కలిగింది.
    ఇద్దరూ గోళీలాటకు స్వస్తి చెప్పి బుద్ధిగ స్కూలుకు వెళుతూ శ్రద్ధగా వుంటూ గోళీల మీదే పైశోధనలు చేయ సాగారు.ఆ తరవాత జీవితంలో అభి వృద్ధిలోకి వచ్చి విమానాన్ని కనుగొన్న "రైట్ " సోదరుల్లాగు అంతరిక్ష పరిశొధనలు చేస్తూ అంతరిక్ష విజ్ఞాన యింజనీర్లుగా పేరు తెచ్చుకున్నారు.

Footer:

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.