Search blog.co.uk

  • దిష్టి!! story-

    దిష్టి!!(సరదాకి ఆట విడుపు మధ్యలో చిన్న కథ.)

    విమలమ్మ గారికి వయస్సుపై బడింది.కళ్లు పత్తిగింజల్లా తయారయ్యాయి. వాటిలో కాటరాక్టు ముదిరి కళ్లు అస్సలు కనిపించట ల్లేదు.అందుకోసం ఆమె కళ్లు చించుకుని చూస్తుంది ఏ కొద్దిగానైనా కనిపించక పోతుందా అని.ఏదో లీలగా మనుష్యుల ఆకారాలూ చిన్ని వెలుతురూ కనిపించినట్టే అనిపిస్తుంది. ఆ కళ్లు ఏదో ఎదర వస్తువుందని ఊహించుకుని పక్కకు తప్పుకుందుకు పని చేస్తున్నాయి. కూతురు శారద తన కూతురు భవానీకి గదిలో అన్నం పెడుతున్నట్టుంది. భవానీ అంటే తనకీ ఇష్టమే! ఎంతైనా మనుమరాలు కదా? అయితే ఆగదిలోకి విమలమ్మ అడుగు పెట్టిందో లేదో శారద గట్టిగా అరిచింది-"వెధవ కళ్లంటూ వెధవ కళ్లు.ఎప్పుడూ తిండి తినని ముఖంలా ఒకటే ఆకలి కళ్లు.దిష్టి కళ్లంటూ దిష్టి కళ్లు! థేబిరించుకుని ఎలా చూస్తోందో? నరుల కంటికి నల్ల రాయి బద్దలౌతుందే భవానీ! ఉండమ్మా నీకు దిష్టి తీసేస్తాను.కాటికి కాళ్లు చాపుకున్నా ఇంకా కూటి మీద ధ్యాసా రంధీ ఈ ముసిల్దానికి పోలేదు.ఎవరినీ ఎదురుకుండా కూచుని అన్నం తిననివ్వదు", అంటూ పెడుతున్న అన్నం కాస్తా దిష్టి తీసేసి బయట పారేసింది శారద. విమలమ్మ గారి మనసు చివుక్కు మంది.కళ్లంటే కనిపించవు కానీ వెధవ మనస్సనేదొకటుండి చచ్చింది కదా! కూతురన్న మాట ఆ మనసుని ముల్లులా పొడిచింది.కనిపించని కళ్లైనా నీటి చలమలై వర్షిస్తాయి.
    విమలమ్మ గారి కళ్లు జల జల కన్నీళ్లు కార్చాయి. "ఎందుకే నోరు పారేసుకుంటావు? నా కళ్లు కనిపించి చావవే! ఇక అవేమి నీ కూతురు తిండిని దిష్టి పెట్ట గలవు?" అని వల వలా ఏడ్చింది విమలమ్మ!
    "ఏమో నాకేం తెలుసు దిష్టి అనేది ఉందో లేదో నీకే తెలియాలి" అంటూ తన పిల్లని తీసుకుని మరో గదిలోకి వెళ్లింది శారద.
    విమలమ్మ గార్కి తన గతం గుర్తొచ్చింది. అప్పుడు తను మంచి వయస్సులో ఉంది. ఎవరికీ పిల్లలు పుట్టనట్టు తనకే పిల్లలు పుట్టినట్టు ఎంతో అపురూపంగా శారదను పెంచింది.నిముష నిముషానికీ తన కూతురికి దిగదుడుపులు తీసేది.ప్రతి అమావాస్యకీ గుమ్మడి కాయా,రోజు విడిచి రోజు నిమ్మ కాయా దిగదుడుపు తీసేది.ఆ రోజుల్లో కూతురు శారద తన చక్రాల్లాటి కళ్లు తెరిచి ఇదంతా ఆశ్చర్యంగా చూసేది.ఇక శారదకు అన్నం పెట్టేటప్పుడు గదిలోకి పొరబాటున అత్తగారు వచ్చిందంటే ఆవిడ పని అయిపోయేదే!కుక్క మీదా పిల్లి మీదా పెట్టి ఎక్కడ లేని తిట్లూ అత్తని తిట్టేది. పాపం అప్పుడు విమలమ్మ అత్త గారి కళ్లు ఉత్త గాజు గోళాలే! ఆ గోళాల్లోకి వెలుతురు ప్రసరించేది కాదు. ఆవిడకు రక్త పోటు ఎక్కువై, ఆప్టిక్ నెర్వ్ దెబ్బ తిని చూపు పోయింది.అయినా ఆవిడ అందరికీ మిడిగుడ్లేసుకు చూస్తున్నట్టే కనిపించేది. అందువల్ల ఆ రోజుల్లో విమలమ్మ తన కూతురు శారదకు తిండి పెట్టేటప్పుడు పొరబాటున ఎవరైనా చూశారంటే దిష్టి తీసి ఆ కంచంలోనిదంతా కుక్కకో పిల్లికో పారేసేది. ఎదురుగా ఎవరైనా ముష్టి వాళ్లొస్తే వాళ్లు తెగ బాధ పడే వారు."అదేంటమ్మా అల్లా కూడుని దిష్టి తీసి కుక్కలకో-పిల్లికో పారబోస్తారు. ఆ కబళ మేదో మా బొచ్చెలో పారేసినా మేము ఒక పూట ఆ తిండి తిని బతకమా" అనే వాళ్లు.
    విమలమ్మ వాళ్ల మీద కూడా విరుచుకు పడేది."దరిద్ర గొట్టు కళ్లు.ఎప్పుడూ మీకు ఆకలే! ఎంత తిన్నా మీ ఆకలి చావదు.అందుకే మా పిల్ల అన్నం తింటూ వుంటే మీరు యావగా చూస్తారు.ఇంకా అన్నం తింటే నా పిల్లకి అరుగుతుందా పాడా?మీ కళ్లు పడ్డ ఆ అన్నం మీరు తిన్నా మీకూ చేటే! అందుకే జంతువులకి పడేస్తాను. అనేది.గతమంతా తలుచుకుని విమలమ్మ గారు "తనకీ శాస్తి జరగ వలసిందే!ఎవరు చేసుకున్న పాపం వారిని వెంటాడుతుంది.అతి ప్రేమ ఈ నా కూతురు శారద మీద చూపి ఇప్పుడు కాటికి కాళ్లు జాపుకున్న ఈ వయసులో ఇలాటి మాటలు పడుతున్నాను", అంటూ బిగ్గరగా ఏడ్వ సాగింది.
    అప్పుడుశారద వచ్చి తన అమ్మ విమలమ్మను
    ఓదార్చింది-"అమ్మా!నిజానికి ఏ కళ్లూ దిష్టి కళ్లు కావు.చూపులతో ఎవరూ దిష్టి కొట్టి తినే తిండిని పాడు చేయ లేరు.ఈ విషయం నీ కెన్నో సార్లు చెప్పి చూసి విసిగి పోయాను. ఇప్పటికైనా అలా మనం మాటాడితే ఎదర వారి మనసు ఎంత నొచ్చుకుంటుందో తెలిపేటందుకే అలా మాటాడాను.నాకు తెలుసమ్మా నీ కళ్లు కనిపించవనీ అందులో పువ్వులేశాయనీ.ఇలా
    నాకూతురు ముందు దిగదుడుపులు నూనె గరిటెలతోనూ వాటితోనూ పెడుతుంటే రేపు ఇదే ఛాదస్తం దాన్ని వెంటాడి మరో విమలమ్మలా తయారౌతుంది. అందుకే నీకు కనువిప్పు కోసం అలా అన్నానమ్మా! ఏమనుకోకు",అని సముదాయించింది.
    విమలమ్మ మనస్సు తాను చేసిన తప్పు తన కూతురు శారద చెయ్యబోవటం లేదని తెలిసి ఆనందించింది!

  • రాంరళీయ షడ్వేదం చతుర్థ దివస పంచ ప్రసూనములు!

    రాంరళీయ షడ్వేదం చతుర్థ దివస పంచ ప్రసూనములు!
    మిస మిస వయసున లలనల
    ఇసురిసురని పొంద గోరి ఇటునటులైతిన్
    రుస రుస లాడక నను నీ
    ముసి ముసి నగవుల దనర్చు మోహన మురళీ!(16)
    తప్పులవిచేస్తిని యపుడు
    ఇప్పట్టున పట్టు వీడి యిట్లైతినిరా
    ముప్పది నికరానున్నది
    ముప్పు తప్పింపగదవె మోహన మురళీ!(17)
    లోకము మెచ్చంగ వలెను
    మా,కరదీపిక యితండు మాత్రమె యనుచున్
    ఏ కరణి మనిషి బతికిన
    మోకరిలు జనములు చెపుమ మోహన మురళీ! (18)
    జగదేక వంద్యు నెప్పుడు
    భగవంతునిగా తలంతు భయ నాశముకై
    ఖగవాహనునిక కొలిచెద
    మొగమును చూపర ముకుంద మోహన మురళీ! (19)
    పరిపూర్ణత పొందుట యని
    తరసాధ్యంబెవెనికైన తామెలకువతో
    నిరతము చదివిన శాస్త్ర
    మ్ము,రయమున పెరుగును గాన మోహన మురళీ!(20)

  • రాంరళీయ షడ్వేదం- తృతీయ దివస పంచ ప్రసూనములు

    రాంరళీయ షడ్వేదం- తృతీయ దివస పంచ ప్రసూనములు.
    నారాయణ యను నామము
    పోరా!చేయకుర యనిన ఫో,పొమ్మనుచున్
    కోరి వదలించుకోవలె
    మోరమతనిది గనరాదు మోహన మురళీ!(11)

    సామాన్యులకును అనుభవ
    మౌ,మాన్యత నిచ్చెడి పరమౌషధముర నీ
    నామస్మరణంబెపుడును
    మోమును చూపర ముకుంద మోహన మురళీ!(12)

    ఏదేవుని యే తలతునొ
    నాదిక్కనియా ముకుందునకె యర్పింతున్
    నాది యనునదేదయి నను
    మోదము తోడ ముకుంద మోహన మురళీ!!(13)

    గతి నిర్దేశం బీవై
    మతి మాలి గతి చెడెడి నను మలచగ నెపుడున్
    అతిశీఘ్రముగను రావే!
    ముతుక వయో వృద్ధుడైతి మోహన మురళీ!(14)

    అవ్వలనివ్వల కావలి
    నివ్వగ ఆద్యంతమందు నీవే నాకున్
    దివ్వెవు కావలె ముద్దుల
    మువ్వలధారీ ముకుంద మోహన మురళీ! (15)

  • రాంరళీయం-ద్వితీయ పంచ ప్రసూనములు.

    రాంరళీయం-ద్వితీయ పంచ ప్రసూనములు.
    థామము నీది విశాల
    మ్మే!మాకును చోటు గలదు మిత్రమ యందున్
    కామన ఇది నాది అరసి
    మోమును చూపర ముకుంద మోహన మురళీ! (6)
    ఏమని కొలిచిన నిన్నే
    మేమని తలిచిన దయ గొని మీటెదవో యీ
    నా, మనమును చెప్పగదే?!
    మోమును చూపుచు ముకుంద మోహన మురళీ! (7)
    కామితము దీర్పగరావ
    దేమిర? నా ఈప్సితములవి శుభకరములౌ
    టేమియు వింతర?! నీ నగు
    మోమును గాంచగ ముకుంద మోహన మురళీ!(8)
    మోమును గనకున్నను ఆ
    రామము నా కేదిరా?విరామము నీయా
    రామము నందుండుగదా?!
    మోమును చూపవె ముకుంద మోహన మురళీ!(9)
    మోమును గనకున్నను ఆ
    రామము నా కేదిరా?విరామము నీయా
    రామము నందుండుగదా?!
    మోమును చూపవె ముకుంద మోహన మురళీ!(10)

  • రాంరళీయం

    రాంరళీయం-పద్యములు -తొలి అయిదు ప్రసూనములు.
    కం|| శ్రీ గణ నాథుని తొల్లిని
    వాగీశ్వరి వాణి సిథ్థి వడయ ,మలిని - నే
    వేగము షడ్వేద రవళి
    మోగగ జేయగ నుతింతు మోహన మురళీ||-1.
    కం|| తొలుత గణపతిని విఘ్నము
    తొలగ ; తదుపరి నిక వాణి తోడుగ దైవం
    బుల నందర కొలిచి విషయ
    ముల దెల్పెద వివరముగ నీకు మోహన మురళీ|| -2.
    కం|| శ్రీ మద్భగవద్గీతను
    నే మహనీయుడు జనులకు నెఱుక బరచెనో
    ఆ మహనీయుని దలవగ
    మోమును జూపర ముకుంద మోహన మురళీ || (3)
    కం|| తల్లి అన సూయ కోరగ
    తొల్లి,మువురు దైవములును తుదకు కలిసిరా
    తల్లి కడుపున పుటుక కై
    ముల్లె మనకు ధారవోయ మోహన మురళీ || (4)
    కం|| ఆ మువ్వురు మూర్తులె;మని
    షై మహినిజనించిలనరి షడ్వర్గమ్ముల్
    కామ పిశాచాదులబడి
    మోమాటుల నుద్ధరింప మోహన మురళీ|| (5)
    అటువంటి గురు దేవులైన శ్రీ గురు దత్తాత్రేయుని మనసులో స్మరించి,మాన వాళి సవ్య మైన మార్గం నడిచేటందుకు వీలుగా,ఆయన తన వాక్సిథ్థిని నాకు అందించి నన్నీ వేద రచనను సవ్యంగా పూర్తి చేయించ మని కోరి ప్రార్థిస్తూ మొదలు పెడ్తున్నాను. నా ఈ కావ్యానికి ముందు నా వంశానుక్రమణికను తెలియ బరుచుకుంటున్నాను.

  • శ్రీ రాంరళీయ షడ్వేదం!! IV

  • రాంరళీయం-V

  • రాంరళీయం-III

    హిందువులు మనిషినీ ఇతర జీవ రాసులనన్నిటినీ దైవంగా భావిస్తారు. ఆకలితో వచ్చిన అతిథిని- (ఆకలితో వచ్చిన జంతువు నైనా) అతిథిని (తిథి-వారం నక్షత్రం లేకుండా వచ్చేవాడు అతిథి.)వానిని "అతిథి దేవో భవ!",అంటారు.వారు ఇంటికి అతిథి వస్తే,ముందు అతిథికి భోజనం (అన్న పానాదులు ) చూశాకే తాము భోజనం చేస్తారు.కుక్షింభరత్వంతో ఎవరైనా ఈ ధర్మాన్ని ఆచరించరనే అనుమానంతో,అతిథిని దైవ స్వరూపుడు అని చెప్పారు.ఇప్పటికి హిందువుల దైవాల లిస్టు ఇది అనుకుంటే రాను రాను ఆ లిస్టు పెరుగుతూ పోతుంది. 1.మాతృదేవోభవ.2.పితృదేవోభవ.3.ఆచార్య (గురు)దేవోభవ.4.అతిథి దేవోభవ.ఇవి కాక వారికి సత్యమన్నది దైవం! "సత్యం వద ",వారి సూక్తి.అసత్యమాడినందువల్ల జరిగే అనర్థాలగూర్చీ,అసత్య దోషం వల్ల అంటే పాపం గూర్చీ వారికి ఎన్నో కథలున్నాయి.ఏకంగా సత్య హరిశ్చంద్రుడని ఆయనపైన ఒక కథేవుంది.ఇన్ని చెప్పినా కొన్ని రాయితీలు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చారు.మాన-ప్రాణ -ధన హాని,వైవాహికములందు బొంకవచ్చునన్నారు. అయితే ఇటువంటి అబద్ధంకూడా,అనృత దోషాన్నించి తప్పించ లేదు. దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సిందే! ఉ|| ధర్మ రాజు యుద్ధంలో "అశ్వత్థా మా హతః కుజరః" అన్నందుకు (కుంజరః అని మెల్లిగా అన్నందుకే ఒక సారి నరకం చూడాల్సిన గతి పట్టిందనే కథ వుంది.అలాగే- శివుని జటాజూటాన్ని బ్రహ్మ చూశాడని తలతో చెబుతూ తోకతో చూడ లేదని అబద్ధపు సాక్ష్యం యిచ్చినందుకు
    ఆవుకు శాపం "ఉదయాన్నే ఆవు ముఖం చూస్తే పాపమనీ-తోక చూస్తే పుణ్యమనీ శివుడు ఇచ్చాడు. మొగలి పువ్వు అబద్ధమాడినందుకు పూజార్హతని కోల్పోయింది.ఇలాటి కథలు ప్రచారం చేసి,సత్యమేవ జయతే అని ఎవరూ అబద్ధమాడకుండా తెలివి తేటలతో దైవం పేరిట కట్టడి చేశారు.ఇంత చక్కటి పద్ధతి అది?!సరే! రాజులు అబద్ధమాడినట్లు తెలిస్తే వేసే శిక్షలు కూడా కట్టడి చేశాయి.అయినా రాజాస్థానాల్లో కొన్ని పరిస్థితుల్లో అబద్ధమాడినందుకు శిక్ష పడదు.అంత మాత్రాన ఆ వ్యక్తి శిక్ష నించి తప్పించుకున్నట్టు కాదు. దైవ సన్నిధిలో శిక్ష అనుభవించాల్సిందే! అందుకోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.ఇన్ని చేసినా పాపం తొలిగితే తొలుగుతుంది-లేకుంటే లేదు! దీని వల్ల ప్రాణంపోయినా అబద్ధమాడని పరిస్థితిలోనికి మనుష్యులను తీసికెళ్లారు. అందువల్ల నిక్కచ్చిగా వున్న వేదాలు మార్పు చేర్పులు లేకుండా నేటి దాకా వచ్చాయి.
    పర మతస్థులను ఆదరించే సహన గుణం హిందువులకు వుంది. " సహనావవతు-సహనౌ భునక్తు-సహవీర్యం కరవావహై,తేజస్వినావధీతమస్తు,మా విద్విషావహై, ఓం శాంతిః,శాంతిః శాంతిః!!" అని చదువుతారు.హిందువులు పర మతాన్ని ఎందుకాదరించారంటే- ఎవరు ఏ విథంగా ప్రయత్నించినా , అన్ని మార్గాలూ దేవుని చేరేటందుకేననీ,ఇతర మతాల వారు చెప్పేదాంట్లో కూడా సత్యముందనీ-(సత్యం హిందువుకు దైవం.తాను అబద్ధ మాడడు కాన ఇతర మతానుయాయులూ అబద్ధాలాడరని నమ్మిక)అందువల్ల ఎవరేది దైవం విషయంలో చెప్పినా వారు నమ్మేస్తారు. దేవుని ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రూపంలోనైనా చూడ గలమని వారు నమ్మిన కారణాన పరమతస్థులు చెప్పే మాటలపై కూడా వారికి నమ్మకం గురీ కుదిరాయి.పైగా పరమతాలను స్వీకరించిన హిందువులు వారి మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు తమ వద్ద నున్న మనోనిశ్చలతతో!ఇదే విధంగా పర మతానుయాయులూ హిందూమతంలో ఆచరించే పద్ధతిలో పయనించి,ఉన్నత శిఖరాలనధిరోహించి మిగిలిన వారికి ఆదర్శ ప్రాయులయ్యారు. ఉ|| కబీరు,తుకారాం ముస్లిమ్ మతంలోని వారు. నేడు -హరే కృష్ణ అనుయాయులూ,సాయి భక్తులూ,రజనీష్ భక్తులూ ఇలా హిందూ వేదాంతుల వెనుక పడిన వారూ కనిపిస్తున్నారు. అలాగే హిందువులు కేరళ లోని సద్బ్రాహ్మణులు అనుకున్న వారు నంబూద్రులు కొందరు మొట్ట మొదటిగా క్రైస్తవ మతం స్వీకరించి ఆ మతానికి ప్రాచుర్యం కల్పించారు. హిందూ మతానికి ఫుల్ స్టాప్ లేదు. అందువల్ల అది విస్తరిస్తూ పోతోంది.మిగిలిన మతాలకి ఫుల్ స్టాప్ పెట్టి -వీడే దేవుడు! ఇలాగే మాగ్రంథంలో రాయబడి వుంది అని అలాగే ఫాలో అవాలి అన్న కారణంగా ఆ మతాలు ఎదరకు వెళ్లకుండా అక్కడితో ఆగిపోయి సంకుంచించుకు పోతున్నాయి. సత్యాన్వేషణకు హిందూ మతం వెసులుబాటు కల్పించిన కారణంగా ఎవరికి వారు ఎవరి పద్ధతిలో వారు దేవుని దర్శించే ప్రయత్నం చెయ్యాలి అనబట్టి వారి మతంలోనించి అనేక మతాలు కుప్ప తిప్పలుగా పుట్టుకొచ్చాయి.తమ మతం కాని దాన్ని సైతాను మతమనిగానీ,తమ మతాన్ని అనుసరించని వానిని చంపడమన్నదిగానీ వారు బోధించలేదు. అందువల్ల అన్ని మతాలకూ హైందవం తల్లి -తండ్రి గానీ అయింది.హైందవమ్నించి పుట్టిన మతాలు-బౌద్ధం,సిక్కిజమ్ ,పార్శీ మతం,జైనిజమ్ ,శాక్తేయం,శైవం,నారాయణీయం, ఇవన్నీ హైందవంలోంచే పుట్టాయి.క్రైస్తవంలో కేథలిక్కులూ-ప్రొటెస్టెంట్లూ,ఇలా విడినా వారు కొలిచే దైవం మారలా!ముస్లిమ్‌సు లో షియాలూ-సున్నీలూ అని ఎన్నో తేడాలున్నా వారి దైవం మారలా! కాని హిందూ దైవం రూపు రేఖలూ మార్చుకున్నాడు,వారి మతానుచారాలూ మారాయి హైందవం నించి పుట్టిన ఉప మతాల్లో!
    To be continued-(ఇంకావుంది)

  • రాంరళీయ షడ్వేదం-II

  • రాంరళీయ షడ్వేదం!!

Footer:

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.